Home  »  Featured Articles  »  బయోగ్రఫీ: దక్షిణ భారత చిత్ర పరిశ్రమ 'మార్లన్ బ్రాండో'.. శివాజీ గణేశన్!

Updated : Jul 20, 2023

(జూలై 21.. శివాజీ గణేశన్ వర్థంతి సందర్భంగా)

సినిమా.. ఓ అందమైన ప్రపంచం. సామాన్య జనాన్ని అన్నీ మరిచి మరో లోకానికి తీసుకెళ్ళే అద్భుత వినోద సాధనం. అలాంటి సినీ రంగంలో ఎందరో నటులు ప్రేక్షకుల్ని అలరించారు. అయితే, కొందరు మాత్రమే తరతరాలు మాట్లాడుకునేలా చిరస్మరణీయ ముద్ర వేశారు. అలాంటి కొందరిలో.. తమిళనాట 'నడిగర్ తిలగమ్' గా పిలువబడే శివాజీ గణేశన్ ఒకరు. పేరుకి తమిళ నటుడే అయినా దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు హిందీ నాట కూడా తనదైన బాణీ పలికించారు శివాజీ. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ.. ఎంతోమంది ప్రముఖ నటులపై తన విలక్షణ అభినయంతో ప్రభావం చూపిన వైనం ఆయన సొంతం. నాలుగు దశాబ్దాలకి పైగా చిత్ర ప్రయాణంలో.. ఆయన వేయని వేషం లేదు. పొందని పురస్కారం లేదు. ఆయనకి దక్కని గౌరవం లేదు. అలాంటి శివాజీ గణేశన్ 22వ వర్థంతి సందర్భంగా.. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీకోసం..  

శివాజీ గణేశన్ 1928 అక్టోబర్ 1న తమిళనాడులోని విల్లుపురంలో చిన్నయ్య మన్రోయార్, రాజమణి అమ్మాల్ దంపతులకు నాలుగో కుమారుడిగా జన్మించారు. ఆయన అసలు పేరు.. వి. చిన్నయ్య మన్రోయార్ గణేశమూర్తి.  ఏడేళ్ళ ప్రాయంలో తండ్రి అనుమతి లేకుండా టూరింగ్ స్టేజ్ డ్రామా కంపెనీలో చేరిన శివాజీ.. పదేళ్ళ వయసులో తిరుచిరాపల్లి వెళ్ళి అక్కడి సంగిలియండపురంలోని డ్రామా ట్రూప్ లో చేరారు.   డ్రామా ట్రూప్ ట్రైనర్స్ నుంచి నటన, నర్తనం నేర్చుకున్నారు. మరీముఖ్యంగా.. భరతనాట్యం, కథక్, మణిపురి నృత్యాల్లో తీసుకున్న శిక్షణ.. శివాజీ జీవితాన్నే మేలిమలుపు తిప్పింది. ఇక తనలోని అసాధారణ జ్ఞాపకశక్తి కారణంగా ఎంతటి డైలాగ్ నైనా గుర్తుంచుకునేవారు శివాజీ. ఆ జ్ఞాపక శక్తినే.. అతనికి నాటకాల్లో ప్రధాన పాత్రలు వరించేలాచేసింది. యుక్తవయసులో 'శివాజీ కాండ హిందూ రాజ్యం' అనే నాటకంలో శివాజీ పాత్ర ధరించి మెప్పించారు గణేశన్. అతని నటనకు ముగ్థుడైన ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఇ.వి. రామస్వామి.. 'శివాజీ గణేశన్' అని పిలిచారు. అలా.. చిన్నయ్య మన్రోయార్ గణేశమూర్తి కాస్త శివాజీ గణేశన్ గా మారారు. 

నేషనల్ పిక్చర్స్ కి చెందిన పంపిణీదారుడు పి.ఎ. పెరుమాళ్ ముదలియార్ ప్రోత్సాహంతో.. 1952 సంవత్సరంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు శివాజీ గణేశన్. కృష్ణన్, పంజు ద్వయం రూపొందించిన 'పరాశక్తి' రూపంలో తొలి అవకాశం దక్కింది శివాజీకి. అయితే ఆ సినిమా నిర్మాణ సమయంలో శివాజీని తొలగించాలనుకున్నారు  ఏవీయమ్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపకుడైన ఏవీ మేయప్పన్. 2 వేల అడుగుల ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయ్యాక.. శివాజీ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చక అతని బదులు కేఆర్ రామస్వామిని తీసుకోవాలనుకున్నారు మేయప్పన్. అయితే, అందుకు పెరుమాళ్ ఒప్పుకోలేదు. శివాజీపై నమ్మకం ఉంచి సినిమాని పూర్తిచేయమన్నారు. చిత్రీకరణ పూర్తయ్యాక మాత్రం మేయప్పన్.. తృప్తిచెందారు. తనని అసంతృప్తికి గురిచేసిన సన్నివేశాలను శివాజీపై  రీషూట్ చేశారు. అలా.. ఎన్నో సందేహల మధ్య పూర్తయిన 'పరాశక్తి' 175 రోజుల పాటు ప్రదర్శితమై శివాజీకి గొప్ప శుభారంభాన్నిచ్చింది. శ్రీలంకకు చెందిన మిలన్ థియేటర్ లో ఈ చిత్రం దాదాపు 40 వారాల పాటు ప్రదర్శితమై అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కోసం శివాజీ గణేశన్ అందుకున్న నెలసరి వేతనం ఎంతో తెలుసా.. రూ. 250.

'పరాశక్తి' తరువాత వచ్చిన శివాజీ చిత్రాల్లో 'అంద నాళ్' అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ రోజుల్లో అస్సలు పాటల్లేకుండా తెరకెక్కడమే ఇందుకు కారణం. ఇందులో యాంటి హీరోగా భలేగా ఎంటర్టైన్ చేశారు శివాజీ. అలాగే, తన పోటీదారుడైన మరో అగ్ర కథానాయకుడు ఎం.జి. రామచంద్రన్ తో కలిసి 'కూన్డుక్కిలి' మూవీ చేశాడు. ఇందులో శివాజీది ప్రతినాయకుడి వేషం. ఈ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. 

'వీరపాండ్య కట్టబొమ్మన్'లో పోషించిన పాత్ర.. శివాజీ జీవితంలో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఈజిప్టులోని కైరోలో 1960 మార్చిలో జరిగిన ఆఫ్రో  ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకి గానూ 'ఉత్తమ నటుడు'గా పురస్కారం అందుకున్నారు శివాజీ. ఓ భారతీయ నటుడు..  ఇలా విదేశాల్లో 'ఉత్తమ నటుడు' అవార్డు అందుకోవడం అదే తొలిసారి. దీంతో.. వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ఈ 'నవరస నాయగన్'.

ఇక 'మహానటి' సావిత్రితో కలిసి శివాజీ గణేశన్ నటించిన 'పాశమలర్' చిత్రం తన కెరీర్ లోనే కాదు తమిళ చిత్ర చరిత్రలోనే మైలురాయిలాంటి సినిమా. జాతీయ పురస్కారం పొందిన ఈ సిస్టర్ సెంటిమెంట్ మూవీ.. పలు భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో ఈ చిత్రాన్నే 'రక్తసంబంధం'గా రీమేక్ చేశారు నటరత్న నందమూరి తారక రామారావు. 

జూమ్ టెక్నాలజీతో తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రంగా పేరొందిన 'ఉత్తమ పుత్రన్'లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన శివాజీ గణేశన్.. ఆపై తన వందో చిత్రం 'నవరాత్రి' కోసం ఏకంగా తొమ్మిది వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఇక తన  200వ చిత్రంగా రూపొందిన 'త్రిశూలమ్'లోనూ త్రిపాత్రాభినయంతో మెస్మరైజ్ చేశారు శివాజీ.  వీటితో పాటు మరెన్నో సినిమాల్లో విలక్షణ భూమికలు ధరించి జనుల్ని రంజింపజేశారు. కెరీర్ చివరి రోజుల్లో 'లోకనాయకుడు' కమల్ హాసన్ కి తండ్రిగా 'దేవరమగన్', సూపర్ స్టార్ రజినీకాంత్ కి నాన్నగా 'పడయప్పా'లో ఆకట్టుకున్నారు. తెలుగులో 'నరసింహ' పేరుతో అనువాదమైన 'పడయప్పా'.. శివాజీ నటించిన ఆఖరి చిత్రం కావడం విశేషం. 

స్వతహాగా తమిళ నటుడైన శివాజీ గణేశన్.. కేవలం తమిళంకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రధాన పాత్రలతో పాటు అతిథి వేషాల్లోనూ ఆయా భాషల్లో వినోదం పంచారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 'పరదేశి' అనే ద్విభాషా చిత్రంతో మొదలుకుని 'పెంపుడు కొడుకు', 'మనోహర', 'బొమ్మల పెళ్ళి', 'నివురు గప్పిన నిప్పు', 'బెజవాడ బెబ్బులి', 'విశ్వనాథ నాయకుడు', 'అగ్ని పుత్రుడు' వరకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు శివాజీ. అదేవిధంగా 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం', 'రామదాసు', 'బంగారు బాబు', 'భక్త తుకారం', 'జీవన తీరాలు', 'చాణక్య చంద్రగుప్త' వంటి తెలుగు సినిమాల కోసం గెస్ట్ రోల్స్ చేశారు. తెలుగులో అనువాదమైన, నేరుగా నిర్మితమైన పలు శివాజీ గణేశన్ చిత్రాలకు శివాజీ గణేశన్ కి మ్యాచ్ అయ్యేలా ప్రముఖ నటులు జగ్గయ్య డబ్బింగ్ చెప్పేవారు. ఇక శివాజీ గణేశన్ చిత్ర ప్రస్థానాన్ని.. "పరాశక్తి ముదల్ పడయప్పా వరై" అనే డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచడం జరిగింది. 

సినిమాల్లో తిరుగులేని తారగా రాణించిన శివాజీ గణేశన్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందే 'ద్రవిడర్ కళగమ్'లో కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసిన గణేశన్.. 1949లో అన్నాదురై స్థాపించిన 'ద్రవిడ మున్నేట్ర కళగం'లో చేరారు. 1956 వరకు గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల డీఎంకే పార్టీని విడిచిన శివాజీ..  ఆనక నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే ఇందిరా గాంధీ మరణంతో శివాజీ రాజకీయ జీవితం మసకబారినట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే.. తరువాతి కాలంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం స్ఫూర్తితో 1988 సంవత్సరంలో 'తమిళగ మున్నేట్ర మున్నాని' పేరుతో సొంత పార్టీని స్థాపించారు శివాజీ. అయితే, ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయారు. ఆపై వి.వి. సింగ్ నేతృత్వంలో 'జనతాదళ్'లో చేరారు. క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. 

చిత్ర పరిశ్రమలో చేసిన కళా సేవకు గానూ 1966లో పద్మశ్రీ, 1984లో పద్మభూషణ్, 1996లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1986లో గౌరవ డాక్టరేట్, 1996లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పొందిన శివాజీ.. 1995లో ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున 'చెవిలియర్' పురస్కారం పొందారు. అలాగే తన అభినయానికి గానూ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు తమిళనాడు స్టేట్ అవార్డ్స్ తో పాటు స్పెషల్ మెన్షన్ విభాగంలో జాతీయ పురస్కారం సైతం అందుకున్నారు శివాజీ. ఇక 'లాస్ ఏంజెల్స్ టైమ్స్' అప్పట్లో శివాజీని 'దక్షిణ భారత చిత్ర పరిశ్రమ మార్లన్ బ్రాండో'గా అభివర్ణించడం విశేషం. 

శివాజీ గణేశన్ పలు పర్యాయాలు తనలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విద్యాసంబంధిత విషయాల్లో, 1965 నాటి ఇండో -పాకిస్థాన్ వార్ సమయంలో పెద్దమొత్తంలో ధన సహాయం చేశారు. అలాగే వేంకటేశ్వర ఆలయం, బృహదీశ్వర ఆలయం, తంజావూర్ టెంపుల్స్ కి ఏనుగులను విరాళమిచ్చారు. ఇక వీరపాండ్య కట్టబొమ్మన్ ఉరితీయబడిన కయతరు స్థలం కొని తన ఖర్చులతో వీరపాండ్య కట్టబొమ్మన్ విగ్రహం స్థాపించారు.  

శివాజీ వారసత్వం విషయానికి వస్తే.. 1952లో ఆయన కమలని వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడబిడ్డలు. మగపిల్లల్లో ఒకరైన ప్రభు కథానాయకుడిగా పలుచిత్రాల్లో ఆకట్టుకున్నారు.  మరో కుమారుడైన రామ్ కుమార్ శివాజీ సొంత సంస్థ అయిన శివాజీ ప్రొడక్షన్స్ ని కొనసాగించారు. అలాగే ప్రభు కుమారుడైన విక్రమ్ ప్రభు.. రామ్ కుమార్ తనయుడైన దుశ్యంత్ రామ్ కూడా నటనలో తమదైన ముద్ర వేస్తూ తాత వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. 

శివాజీ గణేశన్ చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.  దీర్ఘకాలిక గుండె సంబంధిత జబ్బుతో పాటు శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో 2001 జూలై 1న చేరిన ఆయన.. జూలై 21న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు వేలాది అభిమానులు, రాజకీయ నాయకులు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కళాకారుడిగా, సంఘసేవకుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రవేసిన శివాజీ గణేశన్ జీవితం.. ఎందరికో ఆదర్శప్రాయం. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.